Thursday, January 7, 2021

హారతులు - విశిష్టత

మన శివ పరివారం లో ఆ పరమేశ్వరుడు కి చేసే అభిషేకం చాల విశిష్టమైనది , అలాగే హారతులు ఇచ్చే ప్రక్రియ ఇప్పటి వరకు ఎవరు చేయలేదనే చెప్పాలి.. మన పూజ్య గురువు గారు ద్వారా మనం ఇలాంటి అభిషేకం చేసుకో గలుగుతున్నాము . ఇదంతా పరమేశ్వర సంకల్పం అని చెప్పాలి . ఒకవేళ ఎవరైనా హారతులు ఇస్తే ఒకటో రెండో ఇస్తారు. కానీ మన శివ పరివారం లో అభిషేకం అనంతరం ఇచ్చే హారతులు చాల విశేషం గా ఉంటాయి.. ఇంచుమించు అన్ని రకాల హారతులు ఇస్తాము.. 

మన శివ పరివారం కోసం కొన్ని హారతులు  వాటి వివరాలు మీకు అందచేసే ప్రయత్నం చేస్తాను..

తరువాతి సంచికలో ఏయే హారతులు కి ఏ మంత్రం గురువు గారు ఇస్తారో కూడా వ్రాయాలని సంకల్పం..  

సమయం చూసుకుని ఏయే హారతి కి ఏయే మంత్రం వాడతారో వ్రాస్తాను 

హారతులు వివరాలు . 

ధూపహారతి :

మనల్ని కమ్ముకున్న మాయపోర తోలగి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది.

భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమి మీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూప హారతి.

ఏక హారతి :

పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడు కావున ఈహారతి దర్శనం వలన అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశిస్తుంది.

ప్రతిదీ ఒకే విధంగా ఉండటానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చలస్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏక హారతి. ఇది నదుల్లోని ఔషధ గుణాలు పెరగటానికి కూడా తోడ్పడుతుంది.

నేత్ర హారతి :

ఈహారతి దర్శనం వలన నేత్ర దోషాలు తోలగి అమ్మవారి అనుగ్రహం కలుగును 

దివ్య స్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్ర హారతి. దీని వల్ల సమస్తదృష్టిలోపాలు తొలగిపోతాయి

బిల్వ హారతి :

ఈహారతి దర్శనం వలన మూడు జన్మలలో చేసిన పాపములు తోలగి పరమేశ్వరుని అనుగ్రహం కలుగును.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది.మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణశుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తినిస్తుంది.

నాగ హారతి:

ఈహారతి దర్శనం వలన జాతకంలో సంభవించే రాహుకేతువుల దోషాలు కాలసర్ప దోషాలు కుజదోషాలు తోలగి సకల శుభాలు కలుగును.

సంతాన లోపాలు, కాలసర్ప దోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి

పంచ హారతి :

పంచభుతాత్మకుడైన పరమేశ్వరుడు అయిదు ముఖములతో 

విరాజిల్లుతూ ఉంటాడు 

తూర్పున తత్పురుషముఖం 

దక్షిణాన  అఘోర ముఖం 

పశ్చిమాన సద్యోజాత ముఖం 

ఉత్తరాన వామదేవ ముఖం 

ఊర్ద్వమున ఈశానముఖం కావున ఈపంచ హారతి దర్శనం వలన శత్రు భాదలు నశించి ఆయుష్షు ఆరోగ్యం  మనఃశ్శాంతి విజ్ఞానము కలుగును.

ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి.ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళిని కాపాడటానికి ఇచ్చే హారతి.

ద్వాదశ హారతి 

మన జీవితాల్ని నడిపే నవగ్రహాలే దోషాలపాలైతే జీవితం సాఫీగా సాగదు.అందుకే నవగ్రహాల దోషాలను తొలగించడానికి ఈ హారతి పడతారు.

వృక్ష హారతి :

అమ్మవారు ప్రకృతి స్వరూపం అగుటచే ఈహారతి దర్శనం వలన అమ్మవారి అనుగ్రహంతో ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే భాదల నుండి రక్షించబడతారు.

సమస్త వృక్షసంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి.

నంది హారతి :

పరమేశ్వరుడు ఏల్లప్పుడు నందిని అధిరోహించి ఉంటాడు అంటే ధర్మాన్ని అధిరోహించి ఉంటాడు అని ఈహారతి దర్శనం వలన పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో ధర్మనిష్ట కలిగి సత్ప్రవర్తనతో మేలగి కీర్తిప్రతిష్ఠలు పోందుతారు.

సింహ హరతి :

సింహము అమ్మవారి వాహనం అగుటచే ఈహారతి దర్శనం వలన మానసిన ఆందోళనలు భూత ప్రేత పిశాచ భాదలు తోలగి మానశిక ప్రశాంతత కలుగును.

ఇది ప్రతి ఒక్కరు విజయ శిఖరాలను చేరాలని ఇచ్చే హారతి.ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండటానికి ఇచ్చే హారతి.

రుద్ర హారతి :

పరమేశ్వరుడు రుద్రస్వరూపుడు అగుటచే ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ది మనఃశుద్ది కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తోలగును.

రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్ధం.అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.

చక్ర హారతి :

ఈ చక్ర హారతి దర్శనం వలన పంచమహ పాతకము నశించును  కాంతి బలము ధైర్యం ఆయుఃవృద్ది కలుగును.

చక్రం విష్ణుమూర్తి కుడిచేతిలో ఉంటే ఇది గురువుకు ఎడమచేతిలో ఉంటుంది.ఈ హారతి వల్ల ఙ్ఞానం సిద్ధిస్తుంది.ఙ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు.కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్క్రుష్టమైనదిగా భావిస్తారు.

కుంభ హారతి :

ఈ కుంభ హారతి దర్శనం వలన నరఘోష దిష్టిదోషాలు తోలగును .

మంచిపనికీ స్వాగతం పలకడానికి,నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవటానికి ఈ హారతి పడతారు.

కర్పూర హారతి :

ఈ హారతి దర్శనం వలన సకల దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీలక్ష్మీదేవి అనుగ్రహము కలుగును.

సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి.

నృత్య హారతి:

పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్య హారతి.నృత్యం జీవ చైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్యహారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.

రధ హారతి: 

దైవమూర్తులందరికీ రధాలు ఉంటాయి.రధహారతి ఇవ్వడం వల్ల అందరికీ రధాలు,అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రధహారతి.


నక్షత్ర హారతి :

జన్మనక్షత్ర వశాత్తూ నామనక్షత్ర వశాత్తూ ఏఏ దోషములున్న 

ఈ నక్షత్ర హారతి దర్శనం వలన ఆ అ దోషపరీహారములు జరుగును.

ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి.ఆ దోషాలన్నీ తొలగొపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి.

ముత్తయిదువులు ఇస్తారు యీ హారతిని .. 

ఇలా అన్ని రకాల హారతులు తో మన  శివ పరివారం ఈశ్వరాభిషేకం , మంత్రపుష్పం , హారతులు తో ముగుస్తుంది అయితే మన దగ్గర మత్స్య హారతి , వృక్ష హారతి మొదలైన హారతులు లేవు.. ప్రయత్నించాలి.. 

ఇట్లు 

శివ పరివారం