Wednesday, November 11, 2020

విష్ణు మూర్తి పరివారం పేర్లు

ప్రియమైన భాగవత శివ పరివారం కు శుభాకాంక్షలు 

ఈ రోజు భాగవతం లో గురువు గారు శ్రీ మహావిష్ణవు ఎలా వస్తున్నారో విసరిస్తూ ...చెప్పారు..

విష్ణు మూర్తి ఎలా వచ్చారు వారి పరివారం పేర్లు, విష్ణు మూర్తి యొక్క ఆభరణాలు  వివరించారు..మనకి శ్రీనారాయణ కవచం లో కూడా చెప్పారు.. ఈ కవచం అన్ని కలిపి ఒక శ్లోకం కూడా ఉంది .  

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్పుట లేదు; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులు రెంటి యందు; సంధింపడు = ధరించుటలేదు; ఏ = ఏ; పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువడు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుప నియమించడు; ఆకర్ణిక = చెవిదుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమ్మిల్లమున్ = జుట్టుముడిని; చక్కనొత్తడు = చక్కదిద్దుకొనుట లేదు; వివాద = ప్రణయకలహము నందు; ప్రోత్థిత = పైకిలేచుచున్న; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలము = చీరకొంగు; ఐనన్ = అయినను; వీడడు = వదలిపెట్టుట లేదు; గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణములను; అవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి.


భావము:

విష్ణుమూర్తి భక్తరక్షణలో ఎంత గట్టిగా ఉంటాడో చూడండి. ఈ పద్యానికి ఒక కథ. పోతన బావ శ్రీనాథుడు ఈ పద్యం విని, ‘ఏ పరికరాలు లేకుండా అంతటి దేవుడు పరిగెట్టాడని ఎలా వ్రాసావు? అని వెక్కిరించాడట. తరువాత వారిద్దరూ భోజనాలు చేస్తుంటే, పోతన కొడుకు, నూతిలో పెద్దరాయి పడేసి, ‘మామా నీ కొడుకు...’ అని అరిచాడట. ఎంగిలి చేత్తో పరిగెట్టుకొచ్చాడు శ్రీనాధుడు. ‘బావా! తాడైనా లేకుండా ఎందుకు వచ్చావు కాపాడటానికి?’ అన్నాడట పోతన.

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దు కోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

 ఆయుధములు

శంఖము                     పాంచజన్యము

చక్రము                     సుదర్శనము

గద                             కౌమోదకి

ధనుస్సు             శార్ఙ్గము

ఖడ్గము                     నందకము

రథము / తేరు     శతానందము

వాహనము             గరుత్మంతుడు

సేనానాయకుడు     విష్వక్సేనుడు

సారథి                     దారకుడు

గుఱ్ఱములు             1సైబ్య 2సుగ్రీవ 3పుష్ప 4వలాహకములు


ఆభరణములు

తలపై                                                 : కిరీటము

చెవులకు                                             : మకరకుండలాలు

వనమాలిక కంఠమునందలి మాల : వైజయింతీమాల

కంఠమునందలి మాల                        : తులసీమాల

కంఠమునందు                                 : హారాలు

వక్షస్థలమందలి పుట్టుమచ్చ         : శ్రీవత్సము

వక్షమునందలి మణి, కంఠమాలలో : కౌస్తుభము

వక్షమునందు అలంకరించి యుండును : లక్ష్మీదేవి

దేహమున                                         : సరిక్రొత్త పచ్చని పట్టు బట్టలు

దండలకు కడియాలుగా                 : అంగదములు

భుజములకు                                         : భుజకీర్తులు

చేతులకు                                         : కంకణములు

చేతులలో                                         : శంఖ చక్ర గదాలు

చేతిలో                                                 : పద్మము

చేతిలోని మణి                                 : శమంతకము

కటిప్రదేశమున                                 : మొలత్రాడు

కాళ్ళకు                                             : బంగారు అందెలు


కౌమోదకి

1) కౌమోదకి = విష్ణుమూర్తి గద పేరు

వ్యుత్పత్తి    : కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ,

భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది

వ్యుత్పత్తి: కోః మోదకః - కుమోదకః=విష్ణుః, కుమోదకస్య ఇయమ్ - కుమోదక+ఇణ్

త.ప్ర. కుమోదకుని (విష్ణుని) ఆయుధము.


కౌస్తుభము

2) కౌస్తుభము : విష్ణువు వక్షస్థలమందలి మణి.

వృత్పత్తి - కుం (భూమిమ్) స్తుభ్నాతి = కుస్తుభః = సముద్రః - కుస్తుభే భవః = కుస్తుభః+ అణ్ = కౌస్తుభః

భూమిని ఆవరించి ఉన్నది అగుటచే సముద్రము కుస్తుభము అనబడును, అందు పుట్టినది కౌస్తుభము


పాంచజన్యము

పాంచజన్యము విష్ణుమూర్తి శంఖము, శ్రీకృష్ణుని శంఖము

వ్యుత్పత్తి: పంచజనః +ఞ్ - ఞ్యాః వా

పంచజనుడు అను రాక్షసుని ఎముకచే నిర్మింపబడుటచే దీనికి ఈ వ్యవహారము


శ్రీవత్సము = శ్రీమహావిష్ణువు వక్షమున గల ఒక సుడి / మచ్చ.

శ్వేతరోమావర్తము

వృత్పత్తి - వద+స = వత్సః; శ్రీ.యుతః వత్సః

శాకసా. మహత్వమును తెలియజేయు చిహ్నము.


శమంతకము

శమంతకము : విష్ణువు హస్తమునందలి మణి., సత్రాజిత్తు శ్రీకృష్ణునకు సత్యభామతో పాటు సమర్పించిన ఒక మణి



పరిచరాదులు


భార్య లక్ష్మీదేవి

పరిచరులు సునంద, నంద, జయ, విజయ,జయంత, ప్రబల, ఉద్బల, కుముద, కుముదాక్ష,తార్క్ష్య, పుష్పదంత, శ్రుతదేవ, సాత్వత,విష్వక్సేన

పాన్పు                         ఆదిశేషుడు

లోకము                         వైకుంఠము

భక్త సమూహములు వైష్ణవులు

భక్తులు నారదుడు,తుంబురుడు,ప్రహ్లాదుడు,పరీక్షిత్తు,ధ్రువుడు,అంబరీషుడు


అష్టభుజ విష్ణుమూర్తి ఎనిమిది (8) చేతులలో ఉండే ఆయుధాలు:-

చక్రం,

ధనుస్సు,

పద్మం,

శంఖం,

ఖడ్గం,

పాశం,

డాలు,

గదాదండం.


ఈ గజేంద్ర మోక్షం చదివినప్పుడు వింటున్నప్పుడు తెలియాని ఆనందం అనుభూతి వస్తుంది

గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరీ! నీకునమస్కారము. నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము. ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును. కేశవా, నారాయణా, గోవిందా, విష్ణూ, జిష్ణూ, మధుసూదనా, దేవా, మహేశా, మహాత్మా, త్రివిక్రమా, నిత్యరూపా, వామనా శ్రీధరా, హషీకేశా, పద్మనాభా, దామోదరా, సంకర్షణా! నీకు వందనములు, ఓ కృపానిధీ! మమ్ములను  మా శివ పరివారం ను రక్షించుము. 


No comments:

Post a Comment