ప్రియమైన శివ పరివారం కు మహా మాఘి శుభాకాంక్షలు
‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవ కార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. "మా - అఘం'' అంటే పాపం యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది.కావున లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.
మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షుతోపాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు. ఈ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్ముతారు.
మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. "మా'' అంటే మహాలక్షీ. "ధనుడు'' అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని "శ్రీపంచమి'' అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.
"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే
శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''
కనుకనే శ్రీమహాలక్ష్మీ "శ్రీపంచమి''నాడు సరర్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు "అక్షరభ్యాసం'' జరిపిస్తారు. ఈ నాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి "రథసప్తమి'' పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చరుర్ధషిని "శివరాత్రి'' పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి, మాఘశుద్ధ ఏకాదశి "భీష్మ ఏకాదశి'' పర్వదినం చేశాడు.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని "కేతువు'' పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత, మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువి విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు "మఖ'' నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి "మాఘమాసం అనే పేరు వచ్చింది. అందుకే ఈ మాఘం - అమోఖం.
పితృయజ్ఞానికి ప్రాధాన్యత :
మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు "పైతృకాలకు'' ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే, ఆదివారం, అమావాస్య, శ్రవణనక్షత్రం, వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని "అర్ధోదయ పుణ్యకాలం'' అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య, శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక, ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.
మాఘపూర్ణిమ - మహామాఘి :
మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే "మాఘమాసం''. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమటో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ, ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం "మాఘపూర్ణిమ'' నాడైనా నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ "మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది. ఈ "మహామాఘి'' శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ, కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.
ఆ సమయం లో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం.
"స్నానం'' అంటే "షవర్ బాత్'' చేయడమో, "స్విమ్మింగ్ పూల్''లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు, సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.
మాఘస్నాన మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలిపింది. మృకండు మహర్షి- మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని ని పురాణ కథనం.
సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. సముద్రం, నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ "గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం
మనకి అలంటి అవకాశం లేదు కాబట్టి మనం స్నానం చేసే సమయం లో ఆ నీటిలో గంగ మాత 12 నామాలు చెప్పుకుని నీటిలో గంగ ప్రవేశం చేసే స్నానం చేస్తే మంచిది.అవన్నీ మాకు తెలియదు అనుకుంటే ‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.
"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''
అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి, అంటే "దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' అని అర్థం.
ఇదండీ మాఘ మాసం అమోఘం అయినది , ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి..
మరొక విశేషం లో తెలుసుకుందాం
ఇట్లు
శివ పరివారం