ప్రియమైన శివ పరివారం కు శుభాకాంక్షలు
మనం ప్రతి సం భీష్మ తర్పణం ఎలా చేసుకుంటున్నామో క్రమం తప్పకుండ ఈ సం కూడా చేసుకోవాలని పరమేశ్వర సంకల్పం
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది.
మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినమని వేదం lo చెబుతారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాంటి భీష్మాష్టమి రోజున ఏంచేయాలి? ఏం చేస్తే... మోక్షం కలుగుతుందో తెలుసుకుందాం...
భీష్ముడే లేకపోతే భారతమే లేదు! అని నా అభిప్రాయం
నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున (భీష్మాష్టమి) తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరం, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. .
ఈ మాఘమాసం లో ఈ 5 రోజులు చాల ముఖ్యమైనవి.. మనం అందరం భీష్ముడు కి తర్పణం ఇవ్వాలి . ఇక్కడ అందరికి ఒక సంశయం వచ్చును. తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.
భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం.
భీష్మతర్పణ విధి
శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
తర్పణము
1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)
2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)
పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది
భీష్మ తత్వం..గురించి తెలుసుకుందాం
తండ్రికిచ్చిన మాటకోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని మాత్రం త్వజించాడు.
పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా, భీష్ముడే లేకపోతే భారతమే లేదు! తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తాను వివాహం చేసుకోవడం ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు. తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం ఆయన సొంతం. అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అష్టమి రోజున వేడుకున్నాడు.
భీష్ముడి జీవితమంతా పరిపక్వంగానే గడిచింది. ఇక మరణసమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు. అంపశయ్యపై ఉన్న తనను చూడటానికి వచ్చిన ధర్మరాజుకు, రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణపరమాత్ముడుని స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిది.
అందుకు భీష్ముడు 'అవును తల్లీ! ఈ దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదు... అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాన’ని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు.
భీష్మ పితామహుడికి సంతానం లేకపొయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకథలో నిలిచిపోయిన మహొన్నతుడు భీష్మపితా మహుడు. ఈయనకు ఇంతమహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధానకారణం. మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి, ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి, శౌర్యసంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్తవ్రిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో... వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి.
ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడులాం టి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు. కృష్ణతత్వాన్నీ బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు. రాజసూయయాగ సమయంలో అగ్రతాంబూ లం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందు కు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగె త్తుకొస్తున్నా ఆయనను ఎదిరిం చక ఆయన చెతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు. అన్నిటినీ మించి భీష్మాచార్యు డు ఆనాడు ధర్మరాజుకు ఉపదే శించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నయి.
భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈరోజున పటిస్తే, విశేష ఫలితం దక్కుతుంది. కాబట్టే దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు. భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు.
భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే! ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషుడిగా మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి, బహుశా ఈ సూచని చేసి ఉంటారు.
మాఘశుద్ద అష్టమి నుంచి ద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. ఆ మహనీయుడి జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులనూ కేటాయిస్తారు. తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది.
ఆది శంకరా చార్యులు భగవద్గీత, ఉపనిష త్తులు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవత్శక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామా లను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడిమహ త్యాన్ని గురించి తెలుసుకోవటానికి భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికీ అందరికీ ఆయన మార్గ దర్సకుడుగా నిలిస్తున్నాడు
ఇట్లు
శివపరివారం
No comments:
Post a Comment