ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
ప్రతి రోజు గంగ ప్రవాహం లా జరిగే మన భాగవత ఘట్టం లో దశమ స్కంధం లో శ్రీ కృష్ణుడు లీలలు గురించి చెబుతుంటే భలే ఆనందం గా ఉంది. ఈ పద్యం ఎప్పుడు వస్తుందా అని నేను రెండు మూడు రోజులు నుంచి చూస్తున్నాను.
ఓ యమ్మ ! నీ కుమారుడు మాయిండ్లలొ పాలు పెరుగు మననీడమ్మా !
పోయెద మెక్కడికైనను మా యన్నల సురభులాన మంజుల వాణీ !
గోపకాంతలు యశోదమ్మతో తమ కష్టాలు చెప్పుకున్నారు .కానీ యే తల్లైనా తన కొడుకు తప్పు చేసాడంటే ఒప్పుకుంటుందా ?
అన్యమెఱుగడు తనయంత నాడుచుండు , మంచివాడీతడెగ్గులు మానరమ్మ
రామలార ! త్రిలోకాభిరామలార ! తల్లులార ! గుణవతీమ తల్లులార !
తెలుగులో ఇంతకంటే సరళమైన పద్యం ఉండదు . ఒక్క సురభులాన అన్న పదం తప్పితే
మిగిలీన పదాలన్నీ మనం ప్రతిదినం వాడేవే . శ్రీకృష్ణుడు చిలిపి పనులు చేస్తున్నాడు . వెన్న కనిపిస్తే వదలడు . పాలు పెరుగు మాట వేరే చెప్పవలసిన పని లేదు .గొల్లభామలకు ఏం చేయాలో తోచలేదు . యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ” అమ్మా ! నీ కొడుకు మా ఇళ్ళలో పాలూ , పెరుగూ దక్కనీయడం లేదు . ఈ బాధలు భరించలేము . . ఇక పిల్లాపాపలతో ఎక్కడికైనా వెళ్ళిపోతాం . మా ఆవులమీద ఒట్టు ” అని మొరపెట్టుకున్నారు .ఇవేవో మన ఇళ్ళల్లో మాట్లాడుకున్నట్టుగా లేవూ ?
.
నా కన్నయ్యకు నా పాలు తాగడం తప్ప వేరే పని లేదు . అటు ఇటు వెళ్ళగా నేను చూడలేదు . కళ్ళు తెరవని పసి గుడ్డు . తనంతట తాను ఆడుకుంటూ ఆనందిస్తాడు . మంచివాడు మా చిన్ని కృష్ణుడు . మీరందరూ సద్గుణవతులు, అందమైన వారు , చాడీలు చెప్పడం మానుకొండి అని వారిని వేడుకునే సందర్భం .
ఈ పద్యాలు .నానన్నమ్మ / అమ్మమ్మలు లు ఒకప్పుడు పిల్లకు నేర్పిచి పెంచే వారు.. ఓయమ్మ నీ కుమారుడనే పద్యం నేర్చుకోవడం ఎంత సులభమో ఒక సారి గమనించండి . ఒక్క పదం కూడా పలకడానికి కష్టంగా ఉండదు . అర్థం చేసుకోవడం అతి సులభం . పద్యం నేర్చుకున్న పిల్లలకు తల్లి ప్రేమ తెలుస్తుంది . ఏ తల్లీ తన తనయుణ్ణి తప్పుబట్టదు కదా ! మన సంస్కృతి తెలియాలంటే ఇటువంటి పద్యాలు పిల్లలకు నేర్పించడం తప్పనిసరి.
పల్లెటూళ్ళలో బ్రతకడానికి కావలసిన వస్తువులు బహుకొద్ది . మితమైన ఆహారం అందులో ముఖ్యమైనది . అందులో పాలూ , పెరుగూ పిల్లలకు తప్పనిసరిగా కావాలి . కృష్ణ స్వామి వాటినే దొంగిలిస్తున్నాడు . ఇది చాలదన్నట్లు అతివలను ఇబ్బంది పాలు చేస్తున్నాడు . ఇక ఆ పల్లెలో ఉండడమెలా? వెళ్ళిపోతామని మొర పెట్టుకుంటున్నారు యశోదమ్మతో .
అసలు ఈ పద్యం లో ఉండే రహస్యం వేరేగా ప్రయత్నించారు..ఈ కృష్ణ స్వామి కోసమే మేము ఉన్నాము.. కృష్ణుడు లేని ప్రదేశం మేము ఊహిచుకోలేము అని అంతరార్ధం ఈ పద్యం లో అట్టేపెట్టారు. ...
పెద్దగా చదువుకోని పల్లె వాసులు ఉపయోగించే పదాలనే ఉపయోగించి తమ కష్టాలను వివరించడం ఈ పద్యంలో విశేషం . మరి చిన్న పదాలుపయోగించడం వలన భాషలో సౌందర్యం ఏమైనా తగ్గిందా ? నిజం చెప్పాలంటే భాషా సౌందర్యం పెరిగింది . చెప్పవలసిన భావం మన మనస్సుకు హత్తుకునేలా ఎన్నో సద్గుణాలున్న పోతన గారు కవిత్వంలో ఇదీ ఒకటి .
ఇట్లు
శివ పరివారం
No comments:
Post a Comment