ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ లీలామృతం
మనకి నిత్యం గంగా ప్రవాహం లా జరిగే శ్రీ మద్ భాగవతం లో ఇప్పుడు గోపికా వస్త్రాపహరణ ఘట్టం లో ఉన్నాము . అసలు శ్రీమద్భాగవతం లో శ్రీకృష్ణలీలా రసామృతం. లీలలన్నీ అభౌతికాలు, అధ్యాత్మ రహస్యగర్భితాలు , జీవత్వాన్ని తొలగించి చిన్మయత్వాన్ని ప్రసాదిస్తాయి.
అని గురువు గారు తెలియచేసారు. పరమార్థంలో- గోపికల 'అనాది అజ్ఞాన ఆవరణ'మనే అంబరాలను (చీరలను) అపహరించాడు. మనం కృష్ణ తత్వాన్ని గ్రహించాలి
నేను ఒక మంచి పద్యం ను అందించే ప్రయత్నం చేస్తాను
మామా వలువలు ముట్టకు
మామా ! కొనిపోకుపోకు మన్నింపు తగన్
మామాన మేల కొనియెదు?
మామానసహరణ మేల? మానుము కృష్ణా!
నాయనా! కృష్ణా! మా బట్టలు తాకొద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు.
గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్దమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం “మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది. గోపికలు అంటే ఆత్మలు, కృష్ణ అంటే బ్రహతత్వం, వలువలు అంటే అవిద్యా ఆవరణలు, మా అంటే అహంకారం అనుకుంటే వచ్చే శ్లేష విశిష్ఠ మైన అలంకారంగా భాసిస్తుంది. పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు గారు “ప్రజ్ఞ అనె తల్లి తో బుట్టినది బ్రహ్మతత్వం గనుక జీవునికి మామ అయింది” అన్నారు.
మామా = మావి మావి, మా అందరి; వలువలు = వస్త్రములు; ముట్టకు = తాక వద్దు; మామా = నాయనా; కొనిపోకుపోకు = పట్టుకుకొని; పోకు = పోబోకుము; మన్నింపు = మా మాట విను; తగన్ = చక్కగా; మా = మా యొక్క; మానము = మర్యాదను; ఏల = ఎందుకు; కొనియెదవు = తీసెదవు; మా = మా యొక్క; మానస = మనస్సులను; హరణము = అపహరించుట; ఏలన్ = ఎందుకు; మానుము = విడువము; కృష్ణా = కృష్ణుడా.
ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల.
అదే ఈ రోజు గురువు గారు మన శ్రీమద్ భాగవతం లో ప్రస్తావించారు
ఇట్లు
శివ పరివారం
No comments:
Post a Comment