ప్రియమైన శివ పరివారం కు కి రాధా అష్టమి శుభాకాంక్షలు
రాధా రాసేశ్వరీ రాసవాసినీ రసికేశ్వరీ
కృష్ణ ప్రాణాధికా కృష్ణప్రియా కృష్ణస్వరూపిణీ
కృష్ణ వామాంగ సంభూతా పరమానంద రూపిణీ
కృష్ణా బృందావనీ బృందా బృందావనవినోదినే చంద్రావళీ
చంద్రకాంత శరచ్చంద్రనిభాననా నామాన్యేతాని సారాణి తేషామభ్యంతరాణి చ
భాద్రపదమాసం శుద్ధ అష్టమి ఈ దినమే రాధాష్టమి అని అంటారు.(14-09-21)
రాధా కృష్ణులు మా ఇంటి దేవతలు . మా తండ్రి గారు కి మా తండ్రి గారు పూజ్య గురువులు కి ఆరాధ్య దైవం , అంతటా రాధా భజే శ్యామలం
భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు.
రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.
మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెనె్నలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి,విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.
రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని,అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.
గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.
శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.
రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.
వృషభానుడు,కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.
యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం ‘రాధామాధవం’.
ఇట్లు
వాణి నా రాణీ
No comments:
Post a Comment